: కెప్టెన్ కు షాక్...సొంత నేతల వేరుకుంపటి!
తమిళనాట కెప్టెన్ విజయ్ కాంత్ కు షాక్ తగిలింది. ఈసారి ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు కొల్లగొట్టి రాజకీయాల్లో కీలకంగా అవతరించడం ద్వారా ముఖ్యమంత్రి కావాలని భావించిన విజయ్ కాంత్, పలు పార్టీలను కలుపుకుని ప్రజా సంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. తనకు రాజకీయంగా ప్రతికూలత ఉండకూడదని, వేదపండితులతో ఈ మధ్యనే రహస్యంగా యాగం కూడా చేశారు. అయితే ఆయన ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇచ్చినట్టు లేదు. డీఎండీకేలో రగిలిన ముసలం పార్టీని రెండుగా చీల్చింది. అసంతృప్త నేతలంతా తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్ ఆధ్వర్యంలో వేరుకుంపటి పెట్టుకున్నారు. చెన్నైలోని టీనగర్ లోని త్యాగరాజ కళ్యాణ మండపంలో అసంతృప్త నేతలతో చంద్రకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని కోరుకున్న నేతలు, ప్రజా సంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. దీంతో విజయకుమార్ తో తెగతెంపులు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. చంద్రకాంత్ ఆధ్వర్యంలో పీడీఎండీకే పార్టీ పెడుతున్నట్టు వారు వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎండీకే రెండు ముక్కలు కావడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.