: బ్రస్సెల్స్ ఉగ్రదాడి... 'మ్యాన్ ఇన్ హ్యాట్' మహమ్మద్ అబ్రిని అరెస్ట్
గత నెలలో బ్రస్సెల్స్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడులు జరిపిన ఉగ్రవాదులతో పాటు సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు బెల్జియం అధికారులు వెల్లడించారు. అతని పేరు మహమ్మద్ అబ్రిని అని, అతన్ని విచారిస్తే, టోపీ, కోటు ధరించి తిరిగిన వ్యక్తిని తానేనని ఒప్పుకున్నాడని ఫెడరల్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది. బాంబులు పేలడానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపోయిన అబ్రిని, తన కోటును ఓ చెత్తకుండీలో వేశాడని తెలిపారు. శుక్రవారం నాడు అనుమానంతో ఇతన్ని అరెస్ట్ చేశామని, ఆపై శనివారం నాడు ఇతనే 'మ్యాన్ ఇన్ హ్యాట్'గా తాము వెతుకుతున్న వ్యక్తని గుర్తించామని తెలిపారు. 31 సంవత్సరాల అబ్రిని గతంలో చిన్న చిన్న కేసుల్లో నేరస్తుడిగా శిక్షను అనుభవించాడని, ఆ తర్వాత సిరియాకు వెళ్లి వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు.