: ఒక్క ప్రాజెక్టు - కోటి ఉద్యోగాలు!
నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కోటి మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా 7,500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని కలపడంతో పాటు 14,500 కిలోమీటర్ల పొడవైన జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నామని, కోటి మందికి వచ్చే నాలుగైదేళ్లలో ఉద్యోగాలు దగ్గరవుతాయని ఆయన తెలిపారు. రోడ్డు ద్వారా రవాణాకు కిలోమీటర్ కు రూ. 1.5 ఖర్చవుతుండగా, రైలు మార్గంలో రూపాయి వ్యయం భరించాల్సి వస్తోందని, జల రవాణా అందుబాటులోకి వస్తే ఖర్చు 25 పైసలకు తగ్గుతుందని వివరించారు. కేవలం షిప్పింగ్, నౌకాశ్రయాల రంగాల్లో అభివృద్ధితో కోటి ఉద్యోగాలు రానున్నాయని జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం గడ్కరీ మీడియాకు తెలిపారు. 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, 60 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 14 నుంచి మూడు రోజుల పాటు 'మారీటైమ్ ఇండియా సమ్మిట్' నిర్వహించనున్నామని, దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు దేశానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని గడ్కరీ వెల్లడించారు.