: విదేశీ పర్యటనల్లో మోదీకి హోటల్ గదులు అక్కర్లేదట!... నైట్ జర్నీలతో టైం సేవ్ చేస్తున్న వైనం
నిజమేనండోయ్... విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యూహాన్ని మార్చారు. విదేశీ పర్యటనల్లో భాగంగా ఆయా దేశాల్లో బస కోసం హోటల్ గదులను ఆశ్రయించకుండా... నైట్ జర్నీలతో వినూత్న రీతిలో సింగిల్ టూర్ లోనే పలు దేశాలను చుట్టేస్తున్నారు. మొన్నటి మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తాజా వ్యూహం కొట్టొచ్చినట్లు కనిపించింది. తొలుత బెల్జియం పర్యటనకు బయలుదేరిన మోదీ... అక్కడి నుంచి అమెరికాకు ఆ తర్వాత అక్కడి నుంచే సౌదీ అరేబియా వెళ్లారు. సౌదీ రాజధాని రియాద్ నుంచి ఆయన తిరిగి భారత్ చేరుకున్నారు. మూడు దేశాల్లో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రధాని పర్యటనలో మూడు రాత్రుళ్లు ఆయన విమానంలోనే గడిపారు. అంటే ఢిల్లీ నుంచి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్, అక్కడి నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్, అక్కడి నుంచి రియాద్ కు వెళ్లేందుకు రాత్రి ప్రయాణాలనే ఎంచుకున్నారు. రాత్రి ప్రయాణాలతో అటు టైం సేవ్ కావడమే కాక ఇటు బస కోసం హోటల్ గదులు మోదీకి అక్కర్లేకుండా పోయాయి. భవిష్యత్తు విదేశీ పర్యటనలను కూడా ఇదే తరహాలో కొనసాగించాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.