: ఇప్పుడప్పుడే రాలేను!... ఈడీకి మరో షాకిచ్చిన విజయ్ మాల్యా
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... దర్యాప్తు సంస్థల చేత మూడు చెరువుల నీళ్లు తాగించేలానే ఉన్నారు. ఇప్పటికే మాల్యా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పు రూ.9 వేల కోట్లైతే, ప్రస్తుతానికి రూ.4 వేల కోట్లు చెల్లిస్తానని చెప్పడాన్ని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం... అసలు మీ ఆస్తుల విలువెంతో చెప్పాలని, ఎప్పటిలోగా వస్తారో చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు నేడు విచారణకు హాజరుకావాల్సిన మాల్యా, ఆ సంస్థకు మరోమారు షాకిచ్చారు. ఇప్పటికే ఓ మారు గడువు కోరిన మాల్యా... తాజాగా ఈడీ అధికారులకు మరో సందేశం పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను భారత్ రాలేనని, మరింత గడువు ఇవ్వాల్సిందేనని ఆయన ఆ సందేశంలో కోరారు. ప్రస్తుతం బ్యాంకులతో చర్చలు జరుపుతున్నానని, ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే తాను భారత్ వస్తానని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మాల్యా అభ్యర్థనకు ఏ విధంగా స్పందించాలో తెలియక ఈడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారట.