: ‘మండే సూర్యుడి’పై ‘అమ్మ’ నీళ్లు!... సింగిల్ సీటుతో ‘సమత్తువ మక్కల్’ నేతల డీఎంకే బాట
తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో రోజుకో సంచలనం నమోదవుతోంది. ‘కింగ్ మేకర్’గా ఎదిగిన కెప్టెన్ విజయకాంత్ పార్టీని చీల్చడంతో డీఎంకే సఫలమైతే... ‘మండే సూర్యుడి’ ప్రభను పాతాళానికి దించడంలో అన్నాడీఎంకే విజయవంతమైంది. అసలు ఈ ‘మండే సూర్యుడు’ ఎవరనేగా? ఇంకెవరు?.. తమిళ, తెలుగు సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగిన శరత్ కుమారే. రాధికను పెళ్లి చేసుకున్న శరత్ కుమార్ ఆ తర్వాత తమిళ సినీరంగంలో ప్రముఖుడిగా ఎదిగాడు. ఇక తమిళ నాట సినీరంగంలో ఓ స్థాయికి ఎదిగిన నేతలంతా దివంగత ఎంజీఆర్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైనం చూస్తున్నదే. ఆ క్రమంలోనే శరత్ కుమార్ కూడా ‘సమత్తువ మక్కల్’ పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. నాయకర్లకు తానే నాయకుడిననే ప్రచారంతో కొంత మేర జనాన్ని బాగానే ఆకట్టుకున్నారు. తొలుత అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సన్నిహితంగా మెలగిన శరత్ కుమార్... తాజా ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుకు యత్నించి దెబ్బ తిన్నారు. దీంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఆయన అన్నాడీఎంకే పక్కన కూర్చోక తప్పలేదు. అయితే తనకు చేయిచ్చి ప్రత్యర్థి పార్టీతో జట్టు కట్టేందుకు యత్నించిన శరత్ కుమార్ పై ‘అమ్మ’ గుర్రుగా ఉన్నారు. దీంతో కనీసం ఓ పది సీట్లైనా దక్కకపోతాయా? అని భావించిన శరత్ కుమార్ కు సింగిల్ సీటును కేటాయించి జయలలిత సమత్తువ మక్కల్ కు షాకిచ్చారు. అది కూడా శరత్ కుమార్ కు మాత్రమేనంటూ తిరుచెందూరు నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేసేదేమీ లేక శరత్ కుమార్ సైలెంట్ అయిపోగా, సీట్లు దక్కని ఆయన పార్టీ నేతలు మాత్రం డీఎంకే బాట పడుతున్నారు.