: చైనా, పాక్ లకు చెక్!... అమెరికా ‘ప్రిడేటర్’ డ్రోన్ల కోసం భారత్ యత్నాలు షురూ!
శత్రుదేశం పాకిస్థాన్ తన ఆయుధ సంపత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటోంది. పొరుగు దేశంగా ఉన్న చైనా ఆ దేశానికి మద్దతిస్తూ... భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. భారత భూభాగంలోకి దూసుకొస్తూ నిత్యం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ క్రమంలో భారత్... తన ఆగర్భ శత్రు దేశంతో పాటు మరో శత్రువుగా మారుతున్న పొరుగు దేశం చైనాకు చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసే క్రమంలో అమెరికా తయారు చేస్తున్న ‘ప్రిడేటర్’ రకానికి చెందిన డ్రోన్ (పైలట్ రహిత) యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దాదాపు 40 ప్రిడేటర్ల కొనుగోలుకు భారత్ చేయనున్న ప్రతిపాదనకు అమెరికా నుంచి సానుకూల స్పందన రానున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమెరికా రక్షణ శాఖ మంత్రితో కీలక చర్చలు జరపనున్నారని భారత రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ప్రిడేటర్లు భారత్ అమ్ముల పొదిలో చేరితే... పాక్ తో పాటు చైనా దురాక్రమణలకు దాదాపుగా చెక్ పడినట్లేనని భారత మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి.