: వైసీపీ ఆరోపణలు నిజమే అయితే.... ఆ డబ్బు కోసం మినీ లారీలు తెచ్చుకోవాల్సిందే: గూడూరు ఎమ్మెల్యే సునీల్
వైసీపీ టికెట్ పై శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన పాశం సునీల్ కుమార్ నిన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సునీల్... అనివార్య కారణాల వల్లే వైసీపీలో చేరారు. నిన్న సొంత గూటికి చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నందుకు తమకు టీడీపీ రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల దాకా ముట్టజెబుతోందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోతున్నారన్న భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఆరోపణలే నిజమైతే... ఆ డబ్బును తీసుకెళ్లేందుకు మినీ లారీలు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా ‘సాక్షి’ పత్రికలో కొనసాగుతున్న అసత్య ప్రచారానికి తెర దించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైసీపీలో ఉండగా, తమకు జరిగిన అవమానాలను బహిర్గతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.