: మోదీ భాషపై కేజ్రీ విమర్శలు.. ఆ ప్రసంగంపై జర్నలిస్టులు సైలెంట్ గా ఎందుకున్నారని ప్రశ్న
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో నిన్న ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్‌ను టెర్రర్, మౌత్ కరప్షన్ అని విమర్శించారు. అంతేకాక కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటనపై మోదీ.. ఆ దుర్ఘటన మమతా బెనర్జీ పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు దేవుడిచ్చిన సందేశం అంటూ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ఉపయోగించిన ఈ భాషపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగంలో ఉపయోగించిన భాష అభ్యంతకరమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గత ఏడాది డిసెంబరులో తాను ఉపయోగించిన భాషను, గత వారం ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఉపయోగించిన భాషను జర్నలిస్టులు విమర్శించారని, అయితే నిన్న మోదీ ఉపయోగించిన భాషపై జర్నలిస్టులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని అన్నారు. ఇటువంటి భాష ఒక ప్రధాని ఉపయోగించడం మంచిదేనా..? అంటూ ప్రశ్నించారు.