: ఇండియాలో తొలిసారి... 1500 మంది విద్యార్థులను కాపలా కాసేందుకు 600 మంది సైనికులను పంపిన కేంద్రం
శ్రీనగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ). ఇటీవలి గొడవల అనంతరం వర్శిటీలో పరిస్థితులు మరింతగా చేయి దాటకుండా చూసేందుకు ఐదు కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. వర్శిటీలో 1500 మంది విద్యార్థులుండగా, 600 మంది పోలీసులు వారిని కాపలా కాస్తున్నారు. అంటే దాదాపు ప్రతి ఇద్దరు విద్యార్థులకూ ఓ సైనికుడు ఉన్నట్టు. వర్శిటీలో స్థానికేతర విద్యార్థులను స్థానిక పోలీసులు చితకబాదారన్న ఆరోపణలు వచ్చిన తరువాత, తొలుత రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లను పంపిన కేంద్రం, పరిస్థితి అదుపులోకి రాలేదని తెలుసుకున్న తరువాత, సహస్త్ర సీమా బల్ కు చెందిన మూడు దళాలను పంపింది. ఇండియాలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఒక వర్శిటీ భద్రతా బాధ్యతను పూర్తిగా పారామిలటరీ దళాలకు అప్పగించిన ఘటన ఇంతవరకూ ఎన్నడూ జరగలేదు. ఇకపై వర్శిటీలో కేంద్ర బలగాల పహారా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వర్శిటీలో ప్రతి ఒక్కరి బాధ్యతా తమదేనని జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు.