: అందరూ పరోక్షంగా నల్లధనాన్ని దాస్తే... మాల్యా డైరెక్టుగానే దాచారు!: పనామా పేపర్స్ నుంచి షాకింగ్ న్యూస్
విదేశాల్లో నల్లధనాన్ని దాచుకోవాలంటే, అందరూ పరోక్షంగా, వక్రమార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, బ్యాంకుల ముందు ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా నిలబడ్డ విజయ్ మాల్యా మాత్రం డైరెక్టుగానే విదేశాల్లో డబ్బులు దాచుకున్నారు. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) దశలవారీగా విడుదల చేస్తున్న పనామా పేపర్స్ తాజా వివరాల్లో మాల్యా బాగోతం బట్టబయలైంది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్ సంస్థ వెంచర్ న్యూ హోల్డింగ్ లిమిటెడ్ (ఫిబ్రవరి 15, 2006 నుంచి పనిచేస్తోంది) సంస్థకు, విజయ్ మాల్యాకు డైరెక్టు సంబంధాలున్నాయి. ఆయన ఇతర కంపెనీలకు దేనికీ వెంచర్ న్యూ హోల్డింగ్స్ తో సంబంధం లేకపోవడం గమనార్హం. దాదాపు రూ. 4 వేల కోట్ల తన సొంత డబ్బును ఆయన ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ కార్యాలయం ఒకటి బెంగళూరులోని ఆయన ఇంటి చిరునామా (నంబర్ 3, విటల్ మాల్యా రోడ్, బెంగళూరు)పైనే రిజిస్టరై ఉంది. ఇక ఆయన పోర్టికులస్ ట్రస్ట్ నెట్ అనే మరో కంపెనీలో డైరెక్టుగా పెట్టుబడులు పెట్టారు. మాల్యా పేరు బయటకు రానీయకుండా ఫోన్సెక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నదని కూడా తెలుస్తోంది. ఇక ఈ వార్త ఎలాంటి కొత్త చర్చకు దారితీస్తుందో?