: రాజకీయ ట్రిక్కులు నేర్చేసుకుంటున్న క్రికెటర్ శ్రీశాంత్!
ఎస్ శ్రీకాంత్... వివాదాస్పద క్రికెటర్ గా ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకుని, కెరీర్ పాడైపోగా, ఇప్పుడు రాజకీయాల్లో చేరిన కేరళ ఆటగాడు. గత నెలలో భారతీయ జనతా పార్టీలో చేరిన 33 ఏళ్ల శ్రీశాంత్ కు రాజకీయాలు త్వరగానే వంటబట్టాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ఎంచుకోవాల్సిన మార్గాల గురించి ఆయనకు త్వరగానే అవగాహన వచ్చేసింది. తిరువనంతపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, తన ప్రచారానికి వివాహ వేదికలను కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడం, వివాహాలు జరిగే చోట వందల సంఖ్యలో ప్రజలు ఉంటుండడం ఆయనకు కలిసి వస్తోంది. ప్రజలతో మమేకమవుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ సరదా సరదాగా ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రచారాన్ని ఉద్ధృతంగా చేస్తున్న ఆయన ప్రత్యర్థులపై విమర్శలూ వదులుతున్నారు. "నా ప్రత్యర్థులకు నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. నేను టీ-20 ఆటగాడిని కాను. టెస్ట్ మ్యాచ్ లు ఆడేవాడిని. రాజకీయాల్లో నేను స్థిరంగా ఉండబోతున్నా" అని దాదాపు 700 మంది హాజరైన వెడ్డింగ్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో అన్నారు. ఆపై ఆరోగ్యమంత్రి వీఎస్ శివకుమార్ పై విమర్శలు గుప్పించారు. నగరంతో తనకు ఏళ్ల అనుబంధం ఉందని, బీజేపీ నగరానికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ స్కూలు తెచ్చిందని, రోడ్లను బాగుపరిచిందని వ్యాఖ్యానించారు. ప్రజలు బయటి నుంచి వచ్చి పోటీ చేసే వ్యక్తిని అంగీకరిస్తారని అనుకోవడం లేదని చెప్పారు. ఇక శ్రీశాంత్ త్వరగానే రాజకీయాలు వంటబట్టించుకున్నారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.