: ఉగాది పచ్చడి మరింత చేదు... మార్కెట్లో కానరాని వేపపూత!
ఉగాది... తెలుగు సంవత్సరాది. కొత్త సంవత్సరం, వసంత రుతువు ఆరంభమవుతున్న శుభవేళ, ఈ కాలంలో వచ్చే వివిధ రకాల రోగాల నుంచి బయటపడేందుకు అవసరమయ్యే వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందించేలా ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. షడ్రుచులనూ కలుపుతూ తయారు చేసే ఉగాది పచ్చడిలో వాడే పదార్థాల్లో అతి ముఖ్యమైనది వేపపూత. మారుతున్న వాతావరణం, పెరిగిన కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, ప్రజలకు చేయబోయే పెను నష్టాన్ని ముందుగానే చూపుతూ హెచ్చరికగా కాబోలు... ఈ సంవత్సరం ఉగాది వచ్చినప్పటికీ, చాలా చోట్ల వేపచెట్లకు పూత పడలేదు. దీంతో మార్కెట్లో వేపపూత తక్కువగా కనిపిస్తోంది. వేపపూవు లేకుండానే ఉగాది పచ్చడి తినాల్సిన పరిస్థితి వచ్చిందని చాలా అందని ప్రజలు వాపోతున్నారు. మారుతున్న వాతావరణం కారణంగానే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఇక హైదరాబాదులో కొన్ని చోట్ల పూత దొరుకుతున్నప్పటికీ, దాన్ని కొనాలంటే జేబులు గుల్ల చేసుకోకతప్పడం లేదు. రూ. 20 నుంచి రూ. 30 పెడితేగాని గుప్పెడు పూత రావడం లేదని ప్రజలు అంటున్నారు.