: ‘మా ముద్దుల మనవడు దేవాన్ష్...’: ఆహ్వాన పత్రికలో చంద్రబాబు ‘తాత ప్రేమ’
నారా చంద్రబాబునాయుడు... టీడీపీకి అధినేతగానే కాకుండా నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ, పాలనా వ్యవహారాల్లో నిత్యం తలమునకలై ఉండే చంద్రబాబు రూపం ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది. ఎడతెగని సమీక్షలతో రోజులో మెజారిటీ సమయం పాలనా వ్యవహారాల్లోనే ముగినిపోయే ఆయన... తన మనవడు నారా దేవాన్ష్ ఎంట్రీతో సరికొత్తగా మారారు. సెల్ఫీలకు అప్పటిదాకా ప్రాధాన్యమివ్వని చంద్రబాబు మనవడితో కలిసి సెల్ఫీలు దిగారు. మనవడిని చంకనేసుకుని సొంతూళ్లో దేవాలయానికి పాదయాత్రగా వెళ్లారు. పాలన కారణంగా మనవడితో ఆడుకునే సమయం కూడా చిక్కడం లేదని ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు. తాజాగా మనవడి తొలి బర్త్ డేను పురస్కరించుకుని నేడు విజయవాడలో చంద్రబాబు భారీ విందు ఇస్తున్నారు. ఈ విందుకు పార్టీ నేతలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆహ్వానం పలికారు. ఇందుకోసం రూపొందించిన ఆహ్వాన పత్రికలో చంద్రబాబు తన ‘తాత ప్రేమ’ను ఒలకబోశారు. ‘‘మా ముద్దుల మనవడు దేవాన్ష్ తొలి జన్మదిన వేడుక’’ అంటూ పేర్కొని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. నేడు విజయవాడలో జరిగే ఈ విందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలంతా హాజరై సందడి చేయనున్నారు.