: ప్రత్యూష కేసులో కొత్త మలుపులు...హత్య కేసు అయ్యే అవకాశం... రాహుల్ కి ముందస్తు బెయిల్ నిరాకరణ!
హిందీ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసిన వెంటనే ఎలాంటి ఆరోపణలు చేయని ఆమె తల్లి దండ్రులు, తాజాగా ప్రత్యూషతో సహజీవనం చేస్తున్న రాహుల్ రాజ్ సింగ్ పై ఆరోపణలు సంధిస్తున్నారు. తమ కుమార్తెను పథకం ప్రకారం హత్య చేసిన అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ రాజ్ సింగ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్ధానం ముందుకు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా ఇది ఆత్మహత్య కాదని, హత్య కేసు అయ్యే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని ప్రత్యూష కుటుంబం తరపు లాయర్ న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో రాహుల్ బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు. కాగా, రాహుల్ పలువురు మహిళలను మోసం చేసి లక్షలకు ముంచాడని తెలుస్తోంది. పలువురు టీవీ ఆర్టిస్టులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యూషను డబ్బు కోసం రాహుల్ రాజ్ హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు.