: దేవుడు దయ తలిస్తేనే వర్షాలు.. మా చేతుల్లో ఏముంది?: వెంకయ్యనాయుడు
కరవుకు సంబంధించి చేపట్టిన చర్యలపై సుప్రీంకోర్టు తాజాగా కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయి, వర్షాభావ పరిస్థితులతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే, ఈ విషయంపై ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. దేవుడు దయ తలిస్తే వర్షాలు పడతాయని, రైతులకు ఉపశమనం కలుగుతుందని వ్యాఖ్యానించారు. 'కరవు అనేది మా చేతుల్లో ఉందా? దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడే వర్షం వస్తుంద'ని అన్నారు. 'లేదంటే, మేమేం చేయదలుచుకున్నామో అది చేస్తాం' అని చెప్పారు. పరిహారం కావాలని కోరితే ఫండ్స్ రిలీజ్ చేస్తాం, ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. వెంకయ్యనాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. 'దేవుని చర్యలతో ఎన్నో విషయాలు జరుగుతాయి, వాతావరణ మార్పులతో కరవు పరిస్థితులు సంభవిస్తాయి.. కానీ, ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకోవాల్సిందే'నని కాంగ్రెస్ నేత టామ్ వదక్కన్ అన్నారు.