: ఒమన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా గుజరాతీ యువకుడు
అజయ్ లాల్ చేతా... గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించిన 32 ఏళ్ల క్రికెటర్. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా సౌరాష్ట్ర అండర్ 16, 19, 22 జట్లకు ఆడాడు. భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడంలో విఫలమైన అజయ్, 2006లో ఉపాధి కోసం ఒమన్ కు వలస వెళ్లి అల్-తుర్కీ ఎంటర్ ప్రైజస్ లో ఉద్యోగంలో చేరాడు. ఆపై అక్కడి దేశవాళీ టోర్నమెంట్లలో తన సత్తా చాటి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడి, స్వల్ప కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి, కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. "2019 వన్డే వరల్డ్ కప్ పోటీల క్వాలిఫయ్యింగ్ టోర్నీకి ఒమన్ జట్టును చేర్చడమే నా ముందున్న తొలి కర్తవ్యం. ఇందుకోసం జట్టులోని ఆటగాళ్లమంతా కలసి 50 ఓవర్ ఫార్మాట్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాం" అని తెలిపాడు. ఒమన్ కెప్టెన్ గా అజయ్ ఎంపిక కావడంతో ఆయన కుటుంబ సభ్యులు పండగ చేసుకుంటున్నారు. పోరుబందర్ లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన సోదరుడు స్పందిస్తూ, "అజయ్ కెప్టెన్ కావడం మాకందరికీ గర్వకారణం. ఓ దేశపు టీమ్ ను ముందుండి నడిపించే అవకాశం దక్కడంతో అతని కల నెరవేరినట్లయింది" అని అన్నారు. కాగా, 2019 వరల్డ్ కప్ క్వాలిఫయ్యింగ్ పోటీల్లో భాగంగా మే 21 నుంచి 28 వరకూ బ్రిటన్ లో జరిగే పోటీల్లో ఒమన్ తో పాటు టాంజానియా, నైజీరియా, వంటావు తదితర దేశాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అన్నట్టు, ఇటీవలి టీ-20 వరల్డ్ కప్ పోటీల క్వాలిఫైయ్యింగ్ రౌండ్లో ఐర్లాండ్ తో తలపడిన ఒమన్ జట్టు విజయానికి అజయ్ అద్భుత ప్రతిభ కూడా కారణమే. అజయ్ ప్రతిభను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ప్రశంసించాడు.