: మంచు గడ్డలు వదులుతున్న విమానాలు... దేవుడు పగబట్టాడని భయపడుతున్న మధ్యప్రదేశ్ ప్రజలు!
మధ్యప్రదేశ్ లోని హార్దా జిల్లాలోని నౌసార్ గ్రామానికి సమీపంలోని ప్రాంతం... నాలుగు నెలల క్రితం 60 ఏళ్ల ఓ మహిళపై ఫుట్ బాల్ సైజున్న మంచు గడ్డ పడగా ఆమె తీవ్రంగా గాయడింది. రెండు రోజుల క్రితం ఇదే తరహాలో భారీ మంచు గడ్డలు పడ్డాయి. నీలిరంగులో ఉన్న వీటిల్లో ఒకటి 100 కిలోల బరువుంది. అయితే, ఇది నిర్జన ప్రదేశంలో పడటంతో ఎవరూ గాయపడలేదు. రాత్రి 11:45 గంటల సమయంలో భారీ శబ్దం చేస్తూ, ఇది నేలను తాకగా, ఈ ప్రాంతంలోని ట్రైబల్స్ దేవుడికి కోపం వచ్చిందని, అందువల్లే మంచు గడ్డలను భూమిపైకి విసురుతున్నాడని భయపడుతున్నారు. అయితే, అసలు వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే, ఈ ప్రాంతం మీదుగా విదేశాలకు వెళుతున్న విమానాల్లో గడ్డకట్టించిన టాయ్ లెట్ వేస్ట్ ను బయటకు వదులుతుండగా, అవి భూమిని తాకుతున్నాయి. అయితే, టాయ్ లెట్ వేస్ట్ ను చిన్న చిన్న గడ్డలుగా కాకుండా, పెద్దపెద్దవిగా చేస్తుండటంతోనే, అవి కరగకుండానే భూమిని తాకుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు విమానాలు తమ వద్ద ఉన్న వేస్ట్ ను వదిలివేసేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయని ఢిల్లీ కేంద్రంగా సేవలందిస్తున్న కన్సల్టెంట్ బీకే శ్రీవాత్సవ వెల్లడించారు. విమానాలు ప్రయాణిస్తున్న మార్గంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, ఈ తరహా మంచు గడ్డలు తయారవుతాయని ఆయన వివరించారు. విమానాల్లోని మరుగుదొడ్లలో వాడే నీరు అతి శీతల వాతావరణంలో గడ్డకడుతోందని, వీటి బరువు కారణంగా ఇంధనం అధికంగా ఖర్చవుతుందని, ఇంధన ఆదా కోసం వీటిని బయటకు వదిలేస్తుంటారని తెలిపారు. ఇవి తగిలిన వారికి ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనల కింద పరిహారం అందుతుందని పేర్కొన్నారు.