: 'పనామా పేపర్స్'లో ఐపీఎల్ పేరు... సైఫ్ అలీఖాన్, కరీనా, కరిష్మాల పాత్ర!


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కూ పనామా పేపర్స్ మరకలు అంటాయి. 2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని ప్రకటించిన వేళ, దాన్ని సొంతం చేసుకోవడానికి ఓ మిస్టరీ సంస్థ ముందుకు వచ్చింది. పుణె ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలని భావిస్తూ వీడియోకాన్, పంచశీల గ్రూప్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ లు జట్టు కట్టిన వేళ, వీరితో పాటు బీవీఐ (బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్)లో రిజిస్టరైన ముక్కు, మొహం తెలియని కంపెనీ ఓడ్బురేట్ లిమిటెడ్ కూడా భాగమైంది. మొత్తం 10 మంది కలిసి పీ-విజన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కన్సార్టియంను ఏర్పాటు చేసి పుణె ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయగా, ఈ సంస్థ విఫలమైంది. తాజాగా మోసాక్ ఫోనెస్కా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ పేర్లు ఉన్నాయి. పీ-విజన్ లో 15 శాతం వాటా ఓడ్బురేట్ కొనుగోలు చేయగా, వీడియోకాన్ కు 25 శాతం, సైఫ్ అలీ ఖాన్ కు 9 శాతం, కరీనా, కరిష్మాలకు చెరో నాలుగున్నర శాతం, పంచశీల గ్రూప్ కు 33 శాతం వాటాలున్నాయి. అప్పట్లో జట్టును దక్కించుకోవడంలో విఫలమైన పీ-విజన్ కు పెట్టుబడులు పెట్టిన ఓడ్బురేట్ వెనుక ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉండవచ్చని తెలుస్తోంది. అక్టోబరు 2009లో ప్రారంభమైన ఓడ్బురేట్, మార్చి 4, 2010న ఐపీఎల్ బిడ్డింగ్ పేపర్లపై సంతకాలు చేసిందని, జట్టు దక్కక పోవడంతో, ఆ వెంటనే మూత పడిందని మోసాక్ ఫోన్సెకా పత్రాల్లో ఉంది. ఇదే విషయమై వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ను ప్రశ్నించగా, పీ-విజన్ లో 25 శాతం వాటా గురించి మాత్రమే తనకు తెలుసునని, ఇతర సభ్యులు, వాటాదారుల వివరాలు తెలియవని చెప్పడం గమనార్హం. ఇక ఈ ఓడ్బురేట్ వెనుక ఉన్నదెవరు, అక్రమంగా పెట్టుబడులు పెట్టి ఐపీఎల్ టీమ్ ను దక్కించుకోవాలని ప్రయత్నించింది ఎవరన్నది అధికారికంగా తేలాల్సివుంది.

  • Loading...

More Telugu News