: ఇకపై ఫ్రాన్స్ లో కొత్త వ్యభిచార చట్టం... శృంగారానికి డబ్బు చెల్లిస్తే ఫైన్!
ఫ్రాన్స్ దేశంలో కొత్త వ్యభిచార చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం శృంగారం కోసం డబ్బులు చెల్లించే కస్టమర్లపై జరిమానా విధిస్తారు. ఇందుకు సంబంధించిన బిల్లు నిన్న ఫ్రెంచ్ పార్లమెంట్ లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు, వ్యతిరేకంగా 12 ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి, ఫ్రాన్స్ లో వ్యభిచారానికి చట్టపరంగా అనుమతి ఉంది. కానీ, బ్రోతల్ హౌస్ ల ద్వారా మైనర్లతో సెక్స్ మాత్రం చట్ట వ్యతిరేకమని ఫ్రాన్స్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే వ్యభిచారం నేరం కాదు, వ్యభిచారులకు డబ్బులు చెల్లించడం నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై 2,500 డాలర్ల జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ రెండోసారి దొరికిన కస్టమర్లకు విధించే జరిమానా రెట్టింపు అవుతుంది. వ్యభిచారులకు భరోసా పెరుగుతుందని, దేశంలో మానవ అక్రమ రవాణా ఆగుతుందని ఈ బిల్లుకు మద్దతు తెలిపిన వారు అంటున్నారు. కాగా, ఈ కొత్త చట్టం వల్ల వ్యభిచారులకు శిక్ష పడదని, డబ్బులిచ్చిన కస్టమర్లకు మాత్రం శిక్ష పడుతుందని సోషలిస్టు పార్టీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లూ లేకపోలేదు. వ్యభిచారిణులకు ఆదాయం ఉండదని, మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో వ్యభిచార వృత్తిలో సుమారు ముప్ఫై వేల మంది మహిళలు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది విదేశీ మహిళలే!