: నెల్లూరు జిల్లాలో మరోమారు భూప్రకంపనలు... ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన జనం
ఏపీలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల వరుసగా భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జిల్లాలోని వింజమూరు, వరికుంటపాడు మండలాల్లో భూమి కంపించింది. ఈ మండలాల్లోని పలు గ్రామాల్లో రాత్రి ఉన్నట్టుండి భూమి కంపించింది. దాదాపు 3 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపనలతో నిద్ర మత్తు వదిలించుకుని ప్రాణాలు అరచేత బట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు.