: ‘అమ్మ’ దెబ్బతో బెంబేలెత్తిపోతున్న అన్నాడీఎంకే నేతలు!
తమిళ నాట ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించిన కసరత్తుల్లో అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత... తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఇతర పార్టీలన్నీ పొత్తులు ఖరారు కాక తలలు పట్టుకుంటే... ఆ పార్టీలకు షాకిస్తూ ఒంటరి పోరుకే జయ సై అన్నారు. అంతేకాకుండా, బరిలో నిలవనున్న తన అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందుగానే వెల్లడించారు. మొత్తం జాబితాను సింగిల్ లిస్టులోనే ప్రకటించిన ఆమె విపక్షాల గుండెల్లో రైళ్లనే పరుగెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా నిన్న జయలలిత తీసుకున్న నిర్ణయంతో ఆమె సొంత పార్టీ నేతల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయినా... ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? పూర్తి జాబితాను ప్రకటించిన మరునాడే... అందులో ఓ పది మంది అభ్యర్థిత్వాలను రద్దు చేస్తూ సదరు స్థానాలను కొత్త వారితో భర్తీ చేశారు. ఆయా అభ్యర్థుల ట్రాక్ రికార్డులపై ఇంటెలిజెన్స్ వర్గాలతో నివేదికలు తెప్పించుకున్న మీదటే... జయ ఈ నిర్ణయం తీసుకున్నారన్న విషయం తెలిసి ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టికెట్ లభించిందని సంతోషపడుతున్న సమయంలో ఏ క్షణాన తమ టికెట్ ఊడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.