: యువీని దగ్గర్నుంచి చూశాను...అందుకే చేస్తున్నా: సౌరవ్ గంగూలీ
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ను అత్యంత సన్నిహితంగా చూశానని దిగ్గజ క్రికెటర్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, యువీ పడిన బాధ, నొప్పిని తాను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. అంత భయంకరమైన బాధతోనే యువీ 2011 వరల్డ్ కప్ లో అద్భుతమైన పోరాటపటిమ చూపాడని ఆయన కొనియాడారు. చికిత్స తరువాత యువీ క్రికెట్ ఆడతాడని తాను భావించలేదని, అయితే పట్టుదలతో మళ్లీ బ్యాటుపట్టాడని గంగూలీ కొనియాడారు. యువీలా చాలా మంది కేన్సర్ తో బాధపడుతున్నారని, వారిని ఆదుకోవాలని గంగూలీ ఆకాంక్షించారు. దీంతో టాటా మెడికల్ సెంటర్ అంకాలజీ కేర్ యూనిట్ విస్తరణ కోసం విరాళాల సేకరణకు గంగూలీ నడుం బిగించాడు. 'దాదా'ర్ షోంగే దిల్ సే దీజీయే పేరుతో నిర్వహించనున్న ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో దాదా ర్యాంప్ వాక్ చేయనున్నారు. క్రికెట్ ఫీల్డ్ ధీమ్ తో నిర్వహించనున్న ఈ ర్యాంప్ వాక్ తరువాత గంగూలీకి సంబంధించిన పలు వస్తువులను వేలం వేయనున్నారు. ఇలా సేకరించిన మొత్తాన్ని టాటా మెడికల్ కేర్ కు అందజేస్తారు. టాటా మెడికల్ కేర్ కేన్సర్ బాధితులకు అండగా నిలుస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని ఈ సందర్భంగా గంగూలీ ఆకాంక్షించారు.