: జీహాద్ అని అరుచుకుంటూ కాక్ పిట్ లోకి వెళ్లబోయిన వ్యక్తికి 9 నెలల జైలు శిక్ష


విమానం గాల్లో లేచిన తరువాత ఏ ఒక్కరు ఏమాత్రం అనుమానాస్పదంగా ప్రవర్తించినా ప్రయాణికుల ప్రాణాలు పైపైనే పోతాయి. అలాంటిది ఓ వ్యక్తి సీట్లోంచి లేచి జీహాద్ అని అరుచుకుంటూ పరుగెత్తి కాక్ పిట్ లో దూరేందుకు ప్రయత్నిస్తే...ఆ విమానంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? అచ్చం అలాంటి ఘటనే 2015 మార్చిలో అమెరికాలో చోటుచేసుకుంది. అలా అరచిన వ్యక్తి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... 2015 మార్చిలో అమెరికాలోని డల్లాస్ విమానాశ్రయం నుంచి డెన్వర్ కు వెళ్తున్న విమానంలో ప్యాట్రిక్ డియాజ్ అనే వ్యక్తి కూర్చున్నాడు. తొలుత అందరితోపాటు సీట్లో సావధానంగా కూర్చున్న ప్యాట్రిక్...అకస్మాత్తుగా సీట్లోంచి లేచి జీహాద్ అని అరుచుకుంటూ కాక్ పిట్ లో దూరేందుకు ప్రయత్నించాడు. దీంతో వేగంగా స్పందించిన సిబ్బంది అతనిని బంధించి, విమానాన్ని వెనక్కితిప్పి డల్లాస్ లో ల్యాండ్ చేశారు. అనంతరం అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో ప్యాట్రిక్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తన క్లయింట్ తాగి ఉండడంతో మానసిక దౌర్భల్యానికి గురై అలా ప్రవర్తించాడని వివరణ ఇచ్చారు. ఎయిర్ లైన్స్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, అతను చేసినది చిన్న తప్పు కాదని, అతనికి కనీసం 21 నెలల కఠిన కారాగారశిక్ష విధించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి అతనికి 9 నెలల జైలు శిక్ష, 22 వేల డాలర్ల జరిమానా విధించారు.

  • Loading...

More Telugu News