: మాజీ ప్రేయసితో సల్మాన్ నటించనున్నాడా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్ లానీతో కలసి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించనున్నాడా? అంటే, బీటౌన్ అవుననే చెబుతోంది. గతంలో సల్మాన్, సంగీత మధ్య ఘాటు ప్రేమాయణం నడిచిందని పలు కథనాలు వెలువడ్డాయి. అజహరుద్దీన్ తో వివాహానంతరం వారి బంధానికి బ్రేక్ పడింది. కొన్నాళ్ల క్రితం అజార్ తో విడాకులు తీసుకున్న సంగీతా బిజ్ లానీ ముంబైలో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో తెలుగులో విజయవంతమైన 'క్షణం' సినిమాను సల్మాన్, సంగీత జంటతో రీమేక్ చేయాలని సాజిద్ నడియావాలా భావిస్తున్నాడు. కెరీర్ పరంగా మాజీ ప్రేయసికి సాయపడుతుందన్న ఉద్దేశంతోను, ఈ స్టోరీ నచ్చడంతోను ఇందులో నటించేందుకు సల్మాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే విషయంపై వారిద్దరి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ వారిద్దరూ నటిస్తున్నారంటూ బాలీవుడ్ లో కథనాలు ప్రసారమవుతున్నాయి.