: ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలలో వాస్తవాలు చెబుతున్నది తక్కువ మందే!
ఈ కాలంలో సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు ఉండనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా సోషల్ మీడియాలో యువత చురుగ్గా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అందరూ నిజాలు చెబుతున్నారా? అంటే, అస్సలు చెప్పడం లేదని యూకేకు చెందిన ఓ సర్వే వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే నిజాలు చెబుతున్నారని ఆ సర్వే తెలిపింది. సుమారు 2000 మందిపై సర్వే చేయగా వారిలో కేవలం 18 శాతం మంది మాత్రమే నిజాయతీగా ఉంటూ, వాస్తవాలు మాట్లాడుతున్నారని ఆ సర్వే తెలిపింది. ఎక్కువ మంది తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఆసక్తి కలిగేలా పోస్టులు పెడుతున్నట్టు సర్వే తేల్చింది. అలాగే సోషల్ మీడియాలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా అబద్ధాలు చెబున్నారని వెల్లడైంది. తమ సోషల్ మీడియా ప్రొఫైల్ తమ నిజజీవితాన్ని ప్రతిబింబించదని 43 శాతం మంది పురుషులు అభిప్రాయపడడం విశేషం.