: భారత్కు ఉగ్రగురి.. భారీ విధ్వంసమే లక్ష్యం: నిఘావర్గాల హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల పంజా దెబ్బకు ఎన్నో దేశాల్లో భయానక వాతావరణం నెలకొంటున్న వేళ.. భారత్కు మరోసారి ఉగ్రవాద ముప్పు లేకపోలేదంటూ నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారత్లో భారీ విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయాణించి ఈ దాడులకు తెగబడవచ్చని నిఘావర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులతో పాటు, ఓ కాశ్మీరీ భారత్లో దాడులే లక్ష్యంగా ఓ కారులో ప్రయాణిస్తున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల నుంచి తమకు హెచ్చరికలు అందాయని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ తెలిపారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఉగ్రవాదుల వద్ద ఆత్మాహుతి బెల్ట్ సహా విధ్వంసాన్ని సృష్టించే పలు ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోందని డీజీపీ అన్నారు. దీనిపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్య ప్రాంతాల్లో భద్రతా దళాలను అలర్ట్ చేస్తున్నారు.