: ఐపీఎల్ నిర్వహణ కంటే ప్రజలు ముఖ్యం కాదా?: బాంబే హైకోర్టు ప్రశ్న
ఐపీఎల్ నిర్వహించడం కంటే నీటి సంరక్షణ ముఖ్యమని, జల సంరక్షణకు చర్యలు తీసుకోకుంటే క్రికెట్ మ్యాచ్ లను మహారాష్ట్ర నుంచి మరో చోటుకి తరలించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ను ఆదేశించింది. మహారాష్ట్రలో కరవు, నీటి కోరత కారణంగా క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించరాదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు...'నీళ్లను ఎందుకు వృథా చేస్తారు? ఐపీఎల్ నిర్వహణ కంటే ప్రజలు ముఖ్యం కాదా? ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తారు? నీటిని వృథాచేయడం నేరం, మహారాష్ట్రలో కరవు పరిస్థితుల గురించి మీకు తెలుసు కదా?' అంటూ ఎంసీఏను ప్రశ్నించింది. నీటిని వృథా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. కాగా, ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై, పూణే, నాగపూర్ లలో మొత్తం 19 టీ20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.