: ఎల్లుండి టీడీపీలో చేరుతున్నా: వైసీపీ గూడూరు ఎమ్మెల్యే సునీల్ ప్రకటన


వైసీపీ ఎమ్మెల్యేల జాబితా నుంచి మరో ఎమ్మెల్యే పేరు గల్లంతు కానుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై విజయం సాధించిన పాశం సునీల్ కుమార్... తాను టీడీపీలో చేరుతున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నిన్న రాత్రి ఏపీ మంత్రి నారాయణతో కలిసి విజయవాడలో ప్రత్యక్షమైన సునీల్ కుమార్... నేరుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఈ భేటీతోనే సునీల్ కుమార్ టీడీపీలో చేరుతున్నట్లు ఖాయమైపోయింది. చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే సునీల్ వెళ్లిపోయారు. దీంతో సునీల్ కుమార్ టీడీపీలో చేరుతున్న విషయంపై కాస్తంత స్పష్టత కరవైంది. అయితే కొద్దిసేపటి క్రితం నెల్లూరులో మీడియా ముందుకు వచ్చిన సునీల్ కుమార్... తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎల్లుండి (ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న మధ్యాహ్నం 3.30 గంటలకు) తాను టీడీపీలో చేరుతున్నానని సునీల్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, చంద్రబాబుపై నమ్మకంతోనే తాను టీడీపీలో చేరుతున్నానని కూడా సునీల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News