: రోజా సారీ చెబుతారా?... సారీ కోసం డిమాండ్ చేస్తారా?: ‘ప్రివిలేజ్’ విచారణపై సర్వత్ర ఆసక్తి!
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నేటి మధ్యాహ్నం ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు. తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేయించుకునేందుకు రోజా నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఓ మారు సుప్రీంకోర్టు తలుపు తట్టిన రోజా, మరోమారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిండు సభలో రోజా సభానాయకుడు నారా చంద్రబాబునాయుడు, సభాపతి కోడెల శివప్రసాద్, సాటి మహిళా ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఇటు విపక్షం, అటు అధికార పక్షం సీరియస్ గానే పరిగణించాయి. ఈ క్రమంలో ఇరుపార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. దీంతో ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యే విషయాన్ని రోజా తిరస్కరించారు. తాజాగా కోర్టుల చుట్టు తిరిగే కంటే... ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణే బెటరన్న భావనకు వచ్చిన రోజా... నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత భేటీ కానున్న ప్రివిలేజ్ కమిటీ ముందుకు రానున్నారు. విచారణ సందర్భంగా తాను చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల రోజా విచారం వ్యక్తం చేస్తారా? అన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ ను ఎత్తివేయించుకునే క్రమంలో ఓ మెట్టు కిందకు దిగనున్న రోజా, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూనే సారీ చెబుతారని ఓ వాదన వినిపిస్తోంది. అయితే టీడీపీ సభ్యులు తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల కారణంగానే తాను సహనం కోల్పోయి నాడు ఘాటు వ్యాఖ్యలు చేశానని ఆమె ప్రివిలేజ్ కమిటీ ముందు వాదనకు దిగనున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు తనకు క్షమాపణ చెబితే... తాను కూడా సారీ చేప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె కమిటీ ముందు వితండ వాదనకు దిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మరో నాలుగు గంటల పాటు వేచి చూడక తప్పదు.