: ఇక ఏమైనా పంచుకోవచ్చు... పూర్తి సురక్షితమైపోయిన వాట్స్ యాప్!
దాదాపు 100 కోట్ల మందికి పైగా యూజర్లను కలిగివుండి ఇన్ స్టంట్ మెసేజింగ్ సేవలందిస్తున్న, వరల్డ్స్ మోస్ట్ పాప్యులర్ వాట్స్ యాప్ పూర్తి సురక్షితమైపోయింది. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్ బెర్రీ ప్లాట్ ఫాంలపై వాట్స్ యాప్ ను పూర్తి ఎన్ క్రిప్ట్ చేశామని, ఇక ఎవరు ఏం మెసేజ్ లు పంపుకున్నా మరొకరికి తెలిసే అవకాశాలు లేవని వాట్స్ యాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ వెల్లడించారు. "మీరు ఒక మెసేజ్ పంపితే, దాన్ని అవతలి వ్యక్తి లేదా గ్రూప్ మాత్రమే చూడగలదు. సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లకు మీ మెసేజ్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక కనిపించవు. మేము కూడా తెలుసుకోలేం. అంత పటిష్ఠమైన భద్రతా వలయాల మధ్య నుంచి సమాచారం బట్వాడా అవుతుంది" అన్నారు. కాగా, వివిధ కేసులను పరిష్కరించే క్రమంలో పలు దేశాల విచారణ సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో పంచుకునే మెసేజ్ లకు యాక్సెస్ ఇవ్వాలని టెక్ దిగ్గజాలను కోరుతున్న సంగతి తెలిసిందే. కంపెనీలు మాత్రం కస్టమర్ల ప్రైవసీనే తమకు ముఖ్యమంటున్నాయి. యూఎస్ ఎఫ్బీఐ, యాపిల్ మధ్య నెలకొన్న వివాదంలో ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ కూడా యాపిల్ పక్షాన నిలిచి, కస్టమర్లే ముఖ్యమని తేల్చి చెప్పాయి. తాజాగా, ఫేస్ బుక్ అధీనంలోని వాట్స్ యాప్ ను కూడా ఫుల్ ఎన్ క్రిప్ట్ చేయడంతో, వీటిని అసాంఘిక శక్తులు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.