: ఆవు ప్రాణమా, మొసలి ప్రాణమా? దేనికి ప్రాధాన్యం?... తేల్చనున్న అమెరికా కోర్టు!
తన భక్తుడైన గజేంద్రుని కాలును పట్టుకున్న మొసలిని సంహరించేందుకు ఎలా వున్న వాడు అలా లేచి పరుగులు పెట్టిన శ్రీమహావిష్ణువు గురించి మనకు తెలుసు. ఇక్కడ ఏనుగు ప్రాణాలే ముఖ్యమని శ్రీహరి భావించాడు. మరి మొసలిది ప్రాణం కాదా? దాన్ని చంపే హక్కుపై పురాణాల్లో మరింతగా చర్చ జరగలేదు గానీ, నవ నాగరిక సమాజంలో జంతువధపై గట్టిగానే చర్చలు సాగుతున్నాయి. ప్రాణాలు తీసే పెద్దపులిని చంపడం నేరం కాదని ఇటీవల మన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అలాగని ఉద్దేశపూర్వకంగా హతమారిస్తే మాత్రం కఠిన చర్యలేనని హెచ్చరించింది. ఇక తాజాగా, అమెరికాలో అరుదైన భారీ మొసలి ప్రాణం గొప్పదా? లేక ఆవుల ప్రాణాలు గొప్పవా? అన్న ఆసక్తికరమైన కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒకిచోబి అనే ఏరియాలో ఉన్న రైతుకు బోలెడన్ని ఆవులూ, గేదెలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోజుకో ఆవు మరణిస్తూ ఉండటంతో, నిఘాపెట్టిన ఆ ఆసామికి ఓ భారీ మొసలి వచ్చి ఆవులను తినడం కనిపించింది. దీంతో ఆయన మొసలిని హతమార్చేందుకు నిర్ణయించుకుని ఓ వేటగాడి సాయంతో దాన్ని చంపేశాడు. ఆపై దాన్ని ఓ ప్రొక్లయినర్ సాయంతో వేలాడదీసి, ఫోటోలు దిగి, తాను చేసిన ఘనకార్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీటిని చూసిన జంతు సంరక్షకులు కేసు పెట్టగా, ప్రస్తుతం ఫ్లోరిడా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక లెక్కకు మిక్కిలిగా కనిపించే ఆవుల కోసం అరుదైన వన్యప్రాణిని చంపడం తప్పా? కాదా? అన్నది కోర్టు తేల్చనుండగా, వాదనలు ఎలా ఉంటాయి? తీర్పెలా వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.