: విస్కాన్సిన్‌ ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌ల‌కు షాక్‌... ప్రత్యర్థుల ముందంజ!


విస్కాన్సిన్‌ ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌ల‌కు ఓట‌ర్ల‌నుంచి షాక్ త‌గిలింది. అమెరికా ప్రెసిడెంట్‌ పదవికి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. విజ‌యం త‌మ‌ను త‌ప్ప‌క వ‌రిస్తుంద‌ని త‌ల‌చిన‌ హిల్ల‌రీ క్లింట‌న్‌, డొనాల్డ్ ట్రంప్... విస్కాన్సిన్‌లో జ‌రిగిన ఎన్నికల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు డొనాల్డ్ ట్రంప్‌ను అక్క‌డ గ‌ట్టెక్కించ‌లేక‌పోయాయి. ట్రంప్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే ఆయనను ఆ ప్రాంతంలో ఓడిపోయేలా చేశాయ‌ని భావిస్తున్నారు. విశ్లేషకులు ఊహించినట్టుగానే ఈ పార్టీ నుంచి విస్కాన్సిన్‌లో టెడ్‌ క్రుజ్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. మ‌రోవైపు డెమోక్రట్లలో హిల్లరీ క్లింటన్ సైతం ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్నారు. ఈ పార్టీ నుంచి బెర్నీ సాండర్స్ విజ‌య ఢంకా మోగించారు. తాజా ఫ‌లితాలతో అధ్య‌క్ష ప‌దవి రేసులో ఉన్న అభ్య‌ర్థుల‌పై అంచ‌నాలు తారుమార‌య్యాయి. డెమోక్రటిక్‌ పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ నుంచి నామినేట్ అవ‌డానికి స‌ద‌రు అభ్య‌ర్థులకున్న అవ‌కాశాల‌పై వాడీ వేడీ చ‌ర్చ జ‌రుగుతోంది.

  • Loading...

More Telugu News