: బీహార్ లో మద్య నిషేధం!... జార్ఖండ్ కు కాసుల వర్షం!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది. నిత్యం మనం చెప్పుకునే ఈ సామెత జార్ఖండ్ లో తిరగబడింది. బీహార్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఆ రాష్ట్రానికి అయాచిత వరంగా మారింది. అసలు విషయమేమిటంటే... బీహార్ లో ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ పాక్షిక మధ్య నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఈ నెల 1 నుంచి బీహార్ లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో బీహార్ లో మద్యం లభించడం లేదు. ఇక బీహార్ కు పొరుగునే ఉన్న జార్ఖండ్ లోని పది సరిహద్దు జిల్లాల్లో ఒక్కసారిగా మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. గడచిన నెలలో జార్ఖండ్ ఎక్సైజ్ శాఖకు రూ.18 కోట్ల ఆదాయం రాగా... ఈ పది జిల్లాల నుంచే రూ.17 కోట్లు వచ్చిందట. పాక్షిక మద్య నిషేధం ఉంటేనే, ఈ మేర ఆదాయం వస్తే... తాజాగా అమల్లోకి వచ్చిన సంపూర్ణ మద్య నిషేధంతో జార్ఖండ్ ఆబ్కారీ శాఖ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగనుంది. 2016-17 ఏడాదికి సంబంధించి మద్యం షాపుల వేలంలో జార్ఖండ్ ఖజానాకు రూ.58 కోట్లు చేరాయి. గతేడాది ఈ ఆదాయం కేవలం రూ.40 కోట్లేనట. బీహార్ నిర్ణయంతో ఆ రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి మద్యం షాపులకు డిమాండ్ పెరిగిన క్రమంలోనే ఈ మేర ఆదాయం పెరిగిందని జార్ఖండ్ ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.