: తమిళ నాట రాజకీయ ప్రకంపనలు!... కెప్టెన్ కు షాకిచ్చిన కుడిభుజం!
ఎన్నికలకు సమయం ఆసన్నమైన సమయంలో తమిళ నాట రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గంటల వ్యవధిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆయా పార్టీలకు ప్రాణ సంకటంగా మారాయి. ప్రస్తుత ఎన్నికల్లో తమిళ సినీరంగంలో కెప్టెన్ గా పేరుగాంచి ఆ తర్వాత డీఎండీకే పేరిట రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ కాంత్.. ఎటు మొగ్గితే, అటే విజయమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ పార్టీతో పొత్తు కోసం అటు అధికార అన్నాడీఎంకే, ఇటు విపక్ష డీఎంకేలు చేయని యత్నం లేదు. అయితే ఆ రెండు పార్టీలకు షాకిచ్చిన కెప్టెన్... పలు చిన్న పార్టీలతో కలిసి ‘ప్రజా సంక్షేమ కూటమి’గా ఏర్పడ్డారు. కెప్టెన్ నిర్ణయంపై ఆయన పార్టీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. వాటిని పట్టించుకోని కెప్టెన్ ముందుకెళ్లేందుకే సిద్ధపడ్డారు. ఈ క్రమంలో కెప్టెన్ కు కుడిభుజంగానే కాక పార్టీ సిద్ధాంతకర్తగా పేరున్న చంద్రకుమార్ నిన్న తిరుగు బావుటా ఎగురవేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, పది జిల్లాల పార్టీ అధ్యక్షులతో కలిసి ఆయన కెప్టెన్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి బయటకు రావాల్సిందేనని, లేనిపక్షంలో మరింత మంది నేతలతో కలిసి వేరే పార్టీలో చేరతానని చంద్రకుమార్ ప్రకటించారు. నేటి(బుధవారం) మధ్యాహ్నం దాకా చంద్రకుమార్ గడువు విధిస్తే... ఆయనకు షాకిస్తూ కెప్టెన్ కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రకుమార్ సహా, ఆయనకు మద్దతు పలికిన ఐదుగురు ఎమ్మెల్యేలు, పది జిల్లాల అధ్యక్షులు... మొత్తం 16 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక చంద్రకుమార్ తో కలిసి నడిచే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని కూడా డీఎండీకే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.