: ‘అమ్మ’పై హిజ్రా పోటీ!... ఆర్కే నగర్ కు జయ చేసిందేమీ లేదని ఆరోపణ


తమిళ తంబీలు ‘అమ్మ’గా ఆరాధించే అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఈ ఎన్నికల్లో వింత పోటీ ఎదురు కానుంది. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి తన పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను మొన్ననే వెల్లడించిన జయ... తాను చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. గడచిన ఉప ఎన్నికల్లో ఆమెపై పోటీకి అభ్యర్థులను నిలిపేందుకు ప్రధాన పార్టీలన్నీ భయపడ్దాయి. అయితే, తాజా ఎన్నికల్లో జయపై పోటీ చేసేందుకు ఓ హిజ్రా సన్నద్ధమయ్యారు. సేలం జిల్లా మగుదంచావడికి చెందిన దేవి అనే హిజ్రా ప్రస్తుతం ఆర్కే నగర్ కేంద్రంగా పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమిళ సినీ దర్శకుడు సీమన్ కు చెందిన ‘నామ్ తమిళార్ కచ్చి(ఎన్టీకే)’ పార్టీ తరఫున బరిలోకి దిగనున్న దేవి... జయకు మంచి పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ టికెట్ ఖరారైన నేపథ్యంలో నిన్న మీడియాతో మాట్లాడిన దేవి... జయపై ఆరోపణలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జయ అమలుచేయని కారణంగా అర్కే నగర్ నియోజకవర్గం సమస్యల నిలయంగా మారిందని ఆమె ఆరోపించారు. జయపై గెలిస్తే నియోజకవర్గంలో ప్రజారోగ్యం, విద్యకు ప్రాధాన్యమివ్వనున్నట్లు దేవి పేర్కొన్నారు. ప్లస్ టూ (ఇంటర్)వరకు చదువుకున్న దేవి... ప్రస్తుతం 200 మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. 60 మంది వృద్ధులు, అనాథల బాగోగులనూ ఆమె భుజానికెత్తుకున్నారు.

  • Loading...

More Telugu News