: జగన్ కు మరో ఝలక్!... చంద్రబాబుతో గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ భేటీ, ఉగాదిన టీడీపీలోకి!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తలచుకుంటే గంటలో ప్రభుత్వాన్ని కూలుస్తానని ఆయన చేసిన ప్రకటన... నేడు ఆయనకే పెద్ద సమస్యగా మారిపోయింది. పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు వరుస కట్టి టీడీపీలో చేరుతున్నారు. పీఏసీ మాజీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో మొదలైన ‘జంపింగ్’లు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. ఇప్పటికే వైసీపీకి హ్యాండిచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ‘సైకిల్’ ఎక్కేయగా, మరో ఇద్దరు అందుకు రెడీగా ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా వైసీపీకి దాదాపుగా ‘సలాం’ కొట్టేశారు. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిన్న బెజవాడలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో నేరుగా సీఎం ఇంటికి వెళ్లిన సునీల్.. చంద్రబాబుతో భేటీ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మీడియాతో పాశం మాట్లాడకపోయినా, ఆయన వైసీపీని వీడటం ఖాయంగానే కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉగాది పర్వదినాన ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ లో మంత్రి నారాయణ నెరపిన మంత్రాంగంతోనే పాశం టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీతోనే మొదలెట్టిన పాశం... ఆ తర్వాత వివిధ కారణాలతో వైసీపీలో చేరిపోయారు. గూడురు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఆయన తన సొంత గూటికే చేరేందుకు నిర్ణయించుకున్నారు. మంత్రి నారాయణతో పాటు పార్టీ ఎంపీ గరికపాటి మోహన్ రావు... పాశంను తమ వెంట తీసుకెళ్లి చంద్రబాబును కలిశారు. పాశం సునీల్ కుమార్ చేరికకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.