: అమెరికాలో వేడి గాలుల ప్రభావంతో ముందస్తు మరణాలు పెరుగుతాయట!: యూఎస్ అధ్యయనంలో వెల్లడి


అమెరికాలో వేడిగాలుల కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి, రాబోయే కాలంలో ముందస్తు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ వేడిగాలుల ప్రభావం మనిషి గుండె, ఊపిరితిత్తులు, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఈ అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా యూఎస్ లో వేడిగాలుల వల్ల ముందస్తు మరణాల సంఖ్య పెరుగుతుందనే అంశానికి సంబంధించి తాము పలు పద్ధతుల ద్వారా సమాచారం సేకరించామన్నారు. గడచిన సంవత్సరాల్లో వేడి గాలుల కారణంగా ప్రతి ఏటా 670 నుంచి 1,300 మంది వరకు ముందస్తు మరణాలు పొందినట్లు తమ అంచనాలో తేలిందన్నారు. 2100 సంవత్సరం నాటికి ముందస్తు మరణాల సంఖ్య ఏడాదికి 27,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. విపరీతమైన వేడి కారణంగా అడవులు తగలబడటం ద్వారా పూల పుప్పొడి గాలిలో కలిసిపోతుందని, తద్వారా నాణ్యమైన గాలి ఉండదని అన్నారు. దీంతో, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయన్నారు. నాణ్యమైన గాలి పీల్చుకోలేకపోవడం ద్వారా వేలాది మంది ప్రజలు ముందస్తు మరణాలు పొందడం, అనారోగ్యంతో ఆసుపత్రులకు తిరుగుతుండటం, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడం వంటివి రాబోయే సంవత్సరాల్లో తలెత్తుతాయన్నారు. అంతేకాకుండా, వాతావరణంలో సంభవించే మార్పులు కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News