: ఆ కంపెనీల గురించి నాకు తెలియదు: అమితాబ్ బచ్చన్
ప్రపంచ వ్యాప్తంగా చట్టాలకు అతీతంగా కోట్లు కూడబెట్టిన వ్యక్తుల పేర్లతో 'పనామా పేపర్స్' భారీ జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో తొలి రోజు జాబితాలో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేర్లు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై ఐశ్వర్య నిన్ననే వివరణ ఇవ్వగా, నేడు అమితాబ్ స్పందించారు. తాను డైరెక్టర్ గా వ్యవహరించానని చెబుతున్న ఏ కంపెనీ గురించి తనకు తెలియదని ఆయన ప్రకటించారు. మీడియాలో వార్తలు వచ్చినట్టుగా తాను ఏ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో కావాలనే తన పేరును తప్పుగా ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. తానెప్పుడూ పన్నులు ఎగ్గొట్టలేదని ఆయన వివరించారు. కాగా, పనామా పేపర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, అమితాబ్ నాలుగు నౌకాయాన కంపెనీలకు డైరెక్టర్ గా నియమితులైనట్టు తెలుస్తోంది. సీబల్క్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్, లేడీ షిప్పింగ్ లిమిటెడ్, ట్రెజరర్ షిప్పింగ్ లిమిటెడ్, ట్రాంప్ షిప్పింగ్ కంపెనీలకు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించినట్టు పత్రాల్లో ఉండడం విశేషం.