: గ్లోబల్ ఆసుపత్రి నిర్వాకం...ఎత్తు పెంచుతామని చెప్పి కాళ్లలో రాడ్లు వేశారు!


హైదరాబాదు, లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాకం ఒకటి వెలుగు చూసింది. సికింద్రాబాద్ లోని సుచిత్ర ప్రాంతానికి చెందిన నిఖిల్ (22) అనే యువకుడు ఎత్తు తక్కువగా ఉండడంతో గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. దీంతో వారు సర్జరీ చేసి ఎత్తుపెంచవచ్చని చెప్పారు. సర్జరీ చేయించుకోవాలన్న ఆలోచనతో ఇంట్లో వాళ్లకి చెప్పకుండా, తను దాచుకున్న డబ్బుతో, మూడు రోజుల క్రితం స్నేహితుడిని వెంట తెచ్చుకుని, గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అయితే, కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, యువకుడు గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నట్టు తేల్చారు. అయితే తల్లిదండ్రులు వచ్చేసరికి యువకుడ్ని ఆపరేషన్ థియేటర్ కు వైద్యులు తీసుకెళ్లారు. కుమారుడికి ఏమైందో అన్న ఆదుర్దాతో వచ్చిన తల్లిదండ్రులకు వైద్యులు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. రెండు కాళ్లలో రాడ్లు వేసి అతని ఎత్తు పెంచుతున్నామని చెప్పారు. ఇందుకోసం 7 లక్షల రూపాయలు యువకుడి నుంచి వసూలు చేసినట్టు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులకు ఆగ్రహం ముంచుకొచ్చింది. మీరు వైద్యులా? పశువులా? అంటూ నిలదీశారు. చిన్న సర్జరీ చేయాలంటేనే రక్తసంబంధీకుల సంతకాలు తీసుకోవాలని, ఎవరూ లేకుండా ఎలా అతనికి ఆపరేషన్ నిర్వహించారని నిఖిల్ తండ్రి ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. అయితే మైనారిటీ తీరిన వ్యక్తి ఎవరు వచ్చినా, అతని వెనుక ఎవరు లేకున్నా అతను కోరితే ఆపరేషన్ చేస్తామని వారు సమాధానం చెప్పారు. దీంతో తట్టుకోలేకపోయిన నిఖిల్ తండ్రి ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆసుపత్రి తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News