: చంద్రబాబు ఫక్తు రాజకీయ నాయకుడు...జగన్ రేర్ పొలిటీషియన్: జ్యోతుల నెహ్రూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిణతి కలిగిన ఫక్తు రాజకీయనాయకుడని, వైఎస్సార్సీపీ అధినేత పరిపక్వత లేని రేర్ పొలిటీషియన్ అని టీడీపీలో చేరనున్న జ్యోతుల నెహ్రూ విశ్లేషించారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రేర్ పొలిటీషియన్ కావడం వల్లే ఆయనతో ఇమడలేకపోయానని అన్నారు. పార్టీ మారినంత మాత్రాన, చంద్రబాబు గొప్పగా పాలించేస్తున్నారని చెప్పనని ఆయన అన్నారు. అయితే గతంలో తాను వైఎస్సార్సీపీలో ఉండగా ఆరోపించినంత దారుణంగా ఆయన పాలన లేదని, అలాగే టీడీపీ చెబుతున్నంత గొప్పగా కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను బట్టి ఆయన పాలన అద్భుతంగా ఉందని చెప్పడంలో సందేహించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పీఆర్పీ పెట్టిన సందర్భంగా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని భావించానని ఆయన చెప్పారు. తనది అవకాశవాద రాజకీయం కాదని, ఆశావాద రాజకీయమని ఆయన అన్నారు. యనమలతో రాజకీయ విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. యనమల ఆహ్వానం వల్లే తాను టీడీపీలో చేరానని ఆయన అన్నారు. తాను నీతిమంతుడైన నాయకుడినని చెప్పుకోనని ఆయన అన్నారు. తన కోసం కాకున్నా, తనకోసం నిలబడ్డ వారి కోసమైనా తప్పులు చేసి ఉంటానని ఆయన చెప్పారు. బీసీలకు అన్యాయం చేయని విధంగా కాపులకు న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తు చేశారు.