: కుష్బూపై హిజ్రాల ఆగ్రహం.. నోరుపారేసుకోవద్దని హెచ్చరిక
సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో హిజ్రాలు మండిపడుతున్నారు. హిజ్రాలు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం సమంజసం కాదని కుష్బూ చేసిన వ్యాఖ్యలే వారి కోపానికి కారణమయ్యాయి. కుష్బూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద హిజ్రాలు ఆందోళన చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకూ ఉందని నినదించారు. ఎన్నికల్లో పోటీచేసే విషయంలో హిజ్రాలు పునఃపరిశీలన చేసుకోవాలంటూ కుష్బూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నార్త్ ఇండియా వాసి అయిన కుష్బూ గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన మహిళలను కించపరిచే విధంగా ఘోరంగా మాట్లాడారని అన్నారు. ఇప్పుడు హిజ్రాలపై కూడా అటువంటి మాటలే అంటూ నోరుపారేసుకుంటున్నారని విమర్శించారు.