: రాజస్థాన్‌లో మంటగలిసిన మానవత్వం.. దళిత పిల్లలను నగ్నంగా ఎండలో ఊరేగించిన వైనం
మానవత్వం పూర్తిగా దిగజారి పోతోంది. దీనికి రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. బైక్ ను దొంగిలించారనే నెపంతో అక్కడి ముగ్గురు దళిత పిల్లలను నగ్నంగా ఊరేగించిన వైనం చూస్తుంటే మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. నగ్నంగా ఊరేగించడమే కాకుండా, చుర్రుమనే ఎండలో నడి బజార్లో ఆ దళిత పిల్లలను చెట్టుకు కట్టేసి కొట్టారు. రాజస్థాన్ చిత్తోర్ ఘఢ్ లోని బస్సీ గ్రామంలో ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి బైక్‌ని దొంగలించారన్న ఆరోపణలపై ముగ్గురు దళిత పిల్లలపై ఈ దారుణం జరిగింది. తమను హింసించొద్దని, తాము ఏ తప్పూ చేయలేదని ఎంతగా వేడుకున్నా కసాయి గుండెలు కరగలేదు. ఈ పిల్లలపై నేరారోపణ చేసి ఈ దారుణానికి ఒడిగడుతున్నా అక్కడున్న ప్రజలు ఎవరూ ఒక్కమాటా అడగలేదు. చివరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కూడా దళిత చిన్నారులనే అరెస్టు చేశారు. జువైనల్ హోమ్ కు తరలించారు. పిల్లలను దారుణంగా శిక్షించిన వారిపై పోలీసులు ఎలాంటి కేసూ నమోదు చేయకపోవడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం ఈ ఘటన ఆ రాష్ట్ర బాలల సంక్షేమ శాఖ మంత్రికి తెలియడంతో... దళిత పిల్లలను హింసించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.