: ఎవరూ ఊహించని, ప్రేక్షకులు నా నుంచి ఆశించని సినిమా తీస్తా: సంజయ్ లీలా భన్సాలీ
ఎవరూ ఊహించని, ప్రేక్షకులు తన నుంచి ఆశించని సినిమాను తీస్తానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ అన్నారు. 'బాజీరావ్ మస్తానీ' చిత్రానికి జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్న ఆయన, ఈసారి తాను తీయబోయే సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు. తాను ప్రేమకథా చిత్రాల్ని బాగా తీస్తానని, తనకు నచ్చిన విభాగం కూడా ప్రేమ కథా చిత్రాలేనని అన్నారు. అయితే, తనకు సౌకర్యంగా ఉండే ప్రేమ చిత్రాలనే తెరపైకి ఎక్కించాలనుకోవట్లేదని, తన తదుపరి చిత్రం ఊహించని విధంగా ఉంటుందని అన్నారు. అయితే, తన తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తానో తెలియదన్నారు. తనకు కంఫర్ట్ గా ఉండే జోనర్ నుంచి బయటకు వస్తేనే కొన్నిసార్లు మంచి చిత్రాలు తీయగలమని అన్నారు. సినిమాలకు సంబంధించి ప్రస్తుతం తన వద్ద రెండు ఆలోచనలు ఉన్నాయని, వాటిలో ఒక దానిని ఎంచుకునేందుకు శ్రమిస్తున్నానన్నారు. పదిహేను రోజుల్లో ఏ సినిమా చేయబోయేది ప్రకటిస్తానని భన్సాలీ పేర్కొన్నారు.