: పాపాలు బయటపడతాయనే భయంతో కాంగ్రెస్ వణికిపోయింది: కేటీఆర్
గతంలో చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో కాంగ్రెస్ వణికిపోయిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో ఈరోజు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. నీటి సమస్యపై అసెంబ్లీలో చర్చకయినా రాని కాంగ్రెస్ నేతలు నేడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన పాపాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే, ఆ పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ముస్లింల విషయంలో కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముస్లింలకు రిజర్వేషన్లు కావాలంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముస్లింల సంక్షేమంపై టీఆర్‌ఎస్ అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.