: 'ఆడ్-ఈవెన్ డాట్ కామ్'ను అమ్మేసిన 13 ఏళ్ల అక్షత్
అక్షత్ మిట్టల్... ఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తూ, సరి-బేసి విధానాన్ని కేజ్రీవాల్ సర్కారు ప్రకటించిన వేళ, అక్షత్ కు వచ్చిన చిన్న ఆలోచన, అతన్నిప్పుడు కుబేరుడ్ని చేసింది. సరి, బేసి సంఖ్యలతో వాహనాలున్న వారు, తమ వివరాలను నమోదు చేసుకుని, దగ్గర్లోని వాహనదారులతో మాట్లాడి, వారి కార్లలో కార్యాలయాలకు చేరేందుకు సహకరించేలా 'ఆడ్-ఈవెన్ డాట్ కామ్' వెబ్ సైట్ ను తయారు చేసిన బాల మేధావి. అక్షత్ తయారు చేసిన ఈ వెబ్ సైట్ సరి-బేసి విధానం అమలవుతున్న రోజుల్లో ఎంతో పాప్యులర్ అయింది. ఇప్పుడా వెబ్ సైట్ ను కార్ పూలింగ్ సేవలందిస్తున్న యాప్ 'ఓరాహీ' సొంతం చేసుకుంది. భారీ మొత్తానికి ఈ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 2015లో 'ఆడ్-ఈవెన్ డాట్ కామ్' వెబ్ సైట్ ప్రారంభం కాగా, కేవలం ఐదు నెలల వ్యవధిలోనే వెబ్ సైట్ సృష్టికర్తను ధనవంతుడిగా చేసింది. కాగా, నిబంధనల దృష్ట్యా ఎంత మొత్తానికి వెబ్ సైట్ ను కొనుగోలు చేశామన్న విషయం వెల్లడించలేమని 'ఓరాహి' యాజమాన్యం ప్రకటించింది.