: రామ్‌దేవ్, ఫడ్నవిస్ 'భారత్ మాతాకీ జై' వ్యాఖ్యలపై సీపీఎం ఫైర్
భారత్ మాతాకీ జై నినాదం విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, యోగాగురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం విమర్శించింది. ఫడ్నవిస్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ కార్యకర్త మాటల్లా ఉన్నాయే కానీ.. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మాటలుగా లేవని విమర్శించింది. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సీపీఎం, ఫడ్నవీస్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 'భారత్ మాతాకీ జై' అననివాళ్లు ఇండియాలో ఉండేందుకు వీలులేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తనపై వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గారు. నష్ట నివారణ దిశగా తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. భారతీయులు 'జై హింద్' అన్నా, 'జై హిందుస్థాన్' అన్నా అభ్యంతరం లేదని, ఎవరైనా 'నేను భారత్ మాతాకీ జై అనను' అంటే మాత్రం సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన అన్నారు. భారత్ మాతాకీ జై నినాదం చేయని వారి తలలు నరికేసి ఉండేవాడినంటూ యోగాగురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను కూడా సీపీఎం ఖండించింది. ఆయన వ్యాఖ్యలు దేశంలో ద్వేషభావాన్ని, మత హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని దుయ్యబట్టింది. రామ్ దేవ్ బాబాపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ‘భారత్ మాతాకీ జై’ అనకుంటే తాను వందలాది మందిని తలనరికి చంపేసేవాడినని రామ్‌దేవ్ బాబా అన్నారు. అయితే రాజ్యాంగంలో భారత్ మాతాకీ జై అనాలని ఎక్కడా లేదు కాబట్టి, దాని మీద ఉన్న గౌరవంతో ఆ పని చెయ్యడం లేదని వ్యాఖ్యానించారు. ‘భారత్ మాతాకీ జై’ అనడం తనకిష్టం లేదని కొంత మంది బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని, అందుకు వారు సిగ్గుపడాలని విమర్శించారు. ప్రతి ఒక్కరు తమ మాతృదేశాన్ని గౌరవించాల్సిందేనని చెప్పిన విషయం తెలిసిందే.