: కష్టకాలంలో భార్యను రంగంలోకి దించిన ట్రంప్
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా తన భార్య మిలానియాను రంగంలోకి దించారు. 45 ఏళ్ల ఈ మాజీ మోడల్ ట్రంప్ తో పాటు విస్కాన్సిన్ లో ప్రచారానికి వచ్చారు. గడచిన వారం రోజులుగా ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం, రిపబ్లికన్లలోనే చీలిక వచ్చేలా కనిపిస్తుండటం, విస్కాన్సిన్ ప్రైమరీల్లో ట్రంప్ పరాజయం ఖాయమని సర్వేలు తేల్చిన వేళ, నష్ట నివారణ కోసం ఆయన అడుగులు వేశారు. తన భార్య ప్రచారానికి వస్తుందని ముందుగానే చెప్పిన ట్రంప్, ఆమె గతంలో ఎన్నడూ ఇలా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని, తన కోసం వస్తోందని వెల్లడించారు. కాగా, ప్రచారానికి వచ్చిన మిలానియా, తన భర్తకు పూర్తి మద్దతిస్తున్నట్టు తెలిపారు. "100 శాతం నేను నా భర్త వెనకే ఉన్నా. ఆయనలో అద్భుతమైన శక్తి దాగుంది. మెక్సికన్లను ఆయన అవహేళన చేశారని భావించడం లేదు. అక్రమంగా ప్రవేశిస్తూ, అమెరికాలో ఆగడాలు చేస్తున్న వారి గురించి మాత్రమే ఆయన ప్రస్తావించారు. అమెరికాను రక్షించాలన్నదే ఆయన లక్ష్యం. ఆయన్ను గెలిపిస్తే అమెరికా వికసిస్తుంది" అన్నారు.