: సన్నీ లియోన్ పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ పై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. మోడల్, బిగ్ బాస్ మాజీ పోటీదారు పూజా మిశ్రా ఈ దావాను దాఖలు చేసింది. తన పరువుకు నష్టం కలిగించే రీతిలో వ్యవహరించిన సన్నీ లియోన్... అందుకు రూ.100 కోట్లను చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని మిశ్రా ఆ పిటిషన్ లో కోర్టును అభ్యర్థించింది. గతంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో పూజా మిశ్రాతో పాటు సన్నీ లియోన్ పాల్గొంది. ఆ సందర్భంగా తనపై సన్నీ లియోన్ పలు మీడియా సంస్థల్లో పరువు నష్టం కలిగించే రీతిలో ఇంటర్వ్యూలను ఇచ్చిందని మిశ్రా ఆరోపించింది. అంతేకాక తనకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ఓ దినపత్రికలో సన్నీ ఆర్టికల్ ను రాసిందని, ఈ కారణంగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని మిశ్రా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తన పేరిట పలు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ను తాను ఉపసంహరించుకున్నానని, ఈ కారణంగా తనకు రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొంది. తనను బజారుకీడ్చిన సన్నీ లియోన్ పై ఐపీసీ సెక్షన్లు 500 (పరువు నష్టం), 120బీ( కుట్ర) ల కింద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆమె కోరింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ నరేశ్ పాటిల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణను వేసవి సెలవుల తదుపరికి వాయిదా వేసింది.