: దేవగౌడకు రాజ్ భవన్ లోకి అనుమతి నిరాకరణ... గవర్నర్ పై మండిపడ్డ మాజీ ప్రధాని!
కన్నడనాట లోకాయుక్తను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడలను వేస్తోందని ఆరోపిస్తూ, గవర్నర్ వాజూభాయివాలాకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడకు చుక్కెదురైంది. తన కుమారుడు కుమారస్వామి, జనతాదళ్ పార్టీ నేతలతో కలసి రాజ్ భవన్ వరకూ పాదయాత్రగా వెళ్లిన ఆయనకు, లోపలికి ప్రవేశించేందుకు అనుమతి లభించలేదు. తాము ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్నామని చెప్పినప్పటికీ, అధికారులు లోపలికి పంపకపోవడంతో దేవగౌడ మండిపడ్డారు. కన్నడిగుల పట్ల గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవినీతిని అడ్డుకుంటామని చెబుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవినీతి నియంత్రణ దళం, కేవలం లోకాయుక్తను సమాధి చేసేందుకే పనికి వస్తుందని అన్నారు. రాజ్ భవన్ వద్ద ఎంతసేపు వేచి చూసినా గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో చివరికి దేవగౌడ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.